పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి -సీఎం కేసీఆర్

KCR Over Rythu Bandhu Money to Farmers Accounts, Rythu Bandhu Money, Rythu Bandhu Money to Farmers Accounts, Rythu Bandhu Money to Farmers Accounts with in 10 Days, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme Laetst News, Rythu Bandhu Scheme Status, Telangana CM KCR, Telangana Rythu Bandhu, Telangana Rythu Bandhu Scheme

తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి, దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని, దీనికి రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

రాష్ట్రమంతా రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతులందరికీ రైతుంబంధు సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్వయసాయ పనులు ప్రారంభ మయ్యాయని, రైతు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడవద్దని అన్నారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు అభినందనులు తెలిపిన సీఎం కేసీఆర్, రైతుబంధు డబ్బులను కూడా ఉపయోగించుకుని, వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని కోరారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిని ఈ సమావేశంలో సీఎం సమీక్షించారు. అన్ని జిల్లాల నుంచి జిల్లా వ్యవసాయాధికారులు పంపిన నివేదికను పరిశీలించారు. అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం సూచించిన విధంగానే పంటల సాగు జరుగుతున్నట్లు తేలింది. దీని ప్రకారమే ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కూడా కొనుగోలు చేసినట్లు సీడ్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాలంలో 41,76,778 ఎకరాల్లో వరి పంటను, 12,31,284 ఎకరాల్లో కందులను, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్ ను, 60,16,079 ఎకరాల్లో పత్తిని, 1,53,565 ఎకరాల్లో జొన్నలను, 1,88,466 ఎకరాల్లో పెసర్లను, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం అమలు చేయడానికి సిద్ధం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రైతులంతా పంటసాగుకు సిద్దంమైన నేపథ్యలో వెంటనే రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.

‘‘తెలంగాణ సమాజం పరిణామశీలమైనది. రాష్ట్రంలో చైతన్యవంతమైన రైతాంగం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్వయసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం సంకల్పం. నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకం చేసింది. వ్యవసాయరంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ప్రభుత్వం చెబుతున్నది తమ కోసమే అని రైతులు అర్థం కేసుకున్నారు. రైతులంతా నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది గొప్ప ముందడుగు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలవడానికి అమలు చేస్తున్న నియంత్రిత పద్ధతిలో పంటు సాగు విధానంలో మన రైతులు గొప్పగా తొలి అడుగు వేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నది ప్రభుత్వం అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి మంచి ప్రారంభం లభించింది’’ అని సీఎం చెప్పారు.

‘‘రాష్ట్రంలో రైతులంతా పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరు రైతులకు వెంటనే రైతుబంధు సాయం అందించాలి. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు డబ్బులు మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి ఒక ఎకరానికి పదివేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో ఐదు వేలు, యాసంగిలో ఐదు వేలు ఇస్తున్నాం. ఈ వర్షాకాలంలో అందరు రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం ఏడు వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ.5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో 1500 కోట్ల రూపాయలను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం. తక్షణం రైతులకు రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే పని ప్రారంభమవుతుంది. పది పన్నెండు రోజుల్లోనే అందరు రైతులకు రైతుబంధు సాయం బ్యాంకుల్లో జమ కావాలి. ఇది రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని” సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ కుమార్, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu