బీఫార్మసీ విద్యార్థిని సంఘటనలో సంచలన విషయాలు వెల్లడి

Rachakonda CP Mahesh Bhagwat Press Meet over Ghatkesar Pharmacy Student Incident

నగరంలోని ఘట్‌కేసర్‌ సమీపంలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ విద్యార్థినిపై అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని, అలాగే కిడ్నాప్‌కు కూడా ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌లేద‌ని సీపీ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. ఆ విద్యార్థిని కావాలనే కట్టుకథ అల్లి పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని వెల్లడించారు. ముందుగా ఫిబ్రవరి 10 న డయల్ 100 కి ఒక కాల్ వచ్చిందని, రాంపల్లి నుంచి ఆటోలో ఇంటికి రావాల్సిన అమ్మాయి ఇంటికి రాలేదని, ఆటోలో ఎవరో తీసుకెళ్లినట్టు కాల్ లో చెప్పారన్నారు. దీంతో కీసర, ఘటకేసర్ పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారని, ఆ విద్యార్థినికి ఫోన్‌ చేయగా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పారు. అనంతరం రెస్పాన్స్ వచ్చాక లైవ్ లొకేషన్ షేర్ చేయగా, అన్నోజీగూడ వద్ద ఆమెను పోలీసులు గుర్తించి సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

ముందుగా ఆ విద్యార్థిని ఎలాంటి సమాధానం ఇచ్చే స్థితిలో లేదని, అనంతరం అన్నోజిగూడ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు ఆటో డ్రైవ‌ర్లలో ఒకరిని ఆమె గుర్తించి తనను కిడ్నాప్ చేసిన వారిలో అతను ఉన్నాడని చెప్పిందన్నారు. అలాగే త‌న‌పై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపిందన్నారు. అయితే మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ లో అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని తేలిందని పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆమె గుర్తించిన ఆటో డ్రైవర్ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లేడని తేలిందన్నారు. పూర్తి విచారణ జరపగా ఆ విద్యార్థిని కట్టుకథ అల్లిందని గుర్తించామన్నారు.

కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యులతో గొడవలు కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోవడానికే కిడ్నాప్, అత్యాచారం‌ నాటకమాడినట్టు ఆమె తెలిపిందని సీపీ వివరించారు. ఇంటికి రాలేదని తల్లి ఫోన్ చేస్తుండడంతో ఆటో డ్రైవర్‌ కిడ్నాప్ చేసినట్టు తల్లితో చెప్పానని ఆమె అంగీకరించింది. ఇక గతంలో ఆటో డ్రైవర్‌పై ఉన్న కోపంతోనే అతన్ని గుర్తించి కిడ్నాప్‌, అత్యాచారానికి పాల్పడినట్టు అబద్దం చెప్పానని ఆ విద్యార్థిని తెలిపినట్టు సీపీ వెల్లడించారు. ఈ ఘటనను సీసీ ఫుటేజ్‌, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు చేధించినట్టు సీపీ మహేశ్‌ భగవత్‌ వివరించారు. గత రెండ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ప్రజల్లో చర్చనీయాంచమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ