కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన

CM KCR Decides To Look Into Demands Of TSRTC, CM KCR Decides To Look Into Demands Of TSRTC Employees, Demands Of TSRTC Employees, KCR Decides To Look Into Demands Of TSRTC Employees, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Updates

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు సునిల్ శర్మ, నర్సింగ్ రావు, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా, ఇడిలు పాల్గొన్నారు.

విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. అదే తమ ప్రథమ అవసరం అని కూడా చెప్పారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీదనే పట్టుపట్టబోమని చెప్పారు. కార్మిక సంఘాల తరుఫున కోర్టులో వాదించిన న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమనే డిమాండ్ నెరవేరితే తప్ప చర్చలకు రామని కార్మికులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. విలీన డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని వారి న్యాయవాది చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కార్మికులు విలీనం డిమాండ్ వదులుకున్నట్లయింది. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో 21 అంశాలను పరిశీలించాలని కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఆ డిమాండ్లు పరిశీలించాలి. దానికోసం అధ్యయనం చేయండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కార్మికుల డిమాండ్లపై కమిటీ, రెండు రోజుల్లో నివేదిక     

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆర్టీసీ ఎండిగా వ్యవహరిస్తున్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఆరుగురు అధికారులతో కమిటీ వేశారు. ఇడి టి.వెంకటేశ్వర్ రావు అధ్యక్షుడిగా ఇడిలు ఎ. పురుషోత్తం, సి. వినోద్ కుమార్, ఇ.యాదగిరి, వి.వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు ఎన్.రమేష్ లు సభ్యులుగా కమిటి ఏర్పడింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ఆర్టీసీ ఎండికి అందిస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీలు సమ్మెకు మద్దతు పలకడం అనైతికం                                                                                             

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్భలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని సీఎం ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్, బిజెపిలు ఆర్టీసి విషయంలో చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి. రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టీసీ)ను, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడి బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నారు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

1950లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్ లో సవరణలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 2019 బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. ‘మోటార్ వెహికిల్ (అమెండ్మెంట్) యాక్టు 2019’ పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొంది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బిజెపి నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు అని సిఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, స్థానిక బిజెపి నాయకులు రాద్దాంతం చేస్తున్న విషయంపై ప్రధానికి, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రికి లేఖ రాయాలనే విషయం కూడా సమీక్షలో చర్చ వచ్చింది.

[subscribe]