తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆమె ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, గెలిపించారంటూ సీఎం కేసీఆర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ అభినందించి, శాలువాతో సత్కరించారు. వాణీదేవికి విజయాన్ని అందించిన అన్నివర్గాల పట్టభద్రులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వాణీదేవి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించిన పట్టభద్రులకు, ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పల్లా గెలుపుకు కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సీఎం కేసీఆర్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ