తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 27 రోజులుగా సమ్మెను నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో సమ్మె రోజు రోజుకి మరింత ఉధృతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అక్టోబర్ 31, గురువారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. వారితో సమ్మె జరుగుతున్న తీరు, డిమాండ్లు, ఇతర సమస్యలపై చర్చించిన పవన్, వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఇప్పటి వరకు పలువురు ఆర్టీసీ కార్మికులు చనిపోయారని, ఇది కేవలం 48వేల మంది కార్మికుల సమస్య కాదని, ప్రజల సమస్య అని ఆయన అన్నారు. గత 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తుందని, కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవరించడం సరైన విధానం కాదని చెప్పారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సమ్మె తీవ్రతను వివరిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ పట్టించుకోని పక్షంలో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కార్యాచరణలో పాల్గొని సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తానని జేఏసీ నాయకులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
[subscribe]



