ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. “వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ, 14 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవత్సరాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకై అనేక పోరాటాలు సాగించిన పనతల సురేష్ ను తన అభ్యర్థిగా ప్రకటించింది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను” అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. కాగా మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రకటించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ