బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించనున్న టీఆర్ఎస్

సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించటం ఆనవాయితీ. అయితే తాజాగా పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణ హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని పార్టీ తీర్మానించింది. ఈ సెషన్ లో టీఆర్ఎస్ వైఖరిని తెలియజేయాలని, ఏ అంశంలోనూ వెనక్కి తగ్గొద్దని తమ పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

బీజేపీతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంపీలకు చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఎంపీల ధర్నాలతో పార్లమెంటుతో పాటు దేశం మొత్తం దద్దరిల్లాలని, పట్టుపడితే తానేమి చేస్తానో, తన బలమేమిటో ప్రధాని మోదీకి తెలుసని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాలని ఎంపీలకు సీఎం చెప్పారు. విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని కేసీఆర్‌ విమర్శించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదని, షెడ్యూల్‌ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉందని పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని తెలిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ