ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. చందౌలీ జిల్లాలోని చాకియా, సోన్‌భద్రా జిల్లాలోని రాబర్ట్‌గంజ్, దుద్ది నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 35.51 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఏడో దశలో భాగంగా అజంగఢ్, మౌ, జౌన్‌పూర్, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, భదోహి మరియు సోన్‌భద్ర వంటి 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నాడు పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 12,205 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇక ఈ దశలో పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్ర మంత్రులు నీల్‌కాంత్ తివారీ, అనిల్ రాజ్‌భర్, రవీంద్ర జైస్వాల్, గిరీష్ యాదవ్, రామశంకర్ సింగ్ పటేల్, అలాగే కేబినెట్‌కు రాజీనామా చేసి ఎస్పీలో చేరిన దారా సింగ్ చౌహాన్ ఈ దశలో పోటీలో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఆప్ పార్టీలు పోటీ చేస్తుండగా, బీజేపీ, సమాజ్ వాదీ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మార్చి 10న ఓట్లలెక్కింపు పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ