అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని చేజార్చుకుని రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తోలిటెస్టులో కేవలం 21 పరుగులు మాత్రమే చేయడంతో 906 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్స్ తో మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 నుంచి ఇప్పటివరకు స్టీవ్ స్మిత్ 8 సార్లు నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 835 పాయింట్స్ తో మూడో ర్యాంకు పొందాడు. ఇక ఇతర భారత బ్యాట్స్‌మెన్ లలో అజింక్య రహానే 8వ, చటేశ్వర్ పుజారా 9వ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 10వ స్థానాల్లో నిలిచారు.
మరోవైపు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో పాట్ కమ్మిన్స్ 904 పాయింట్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెయిల్ వాగ్నర్ 843, జాసన్ హోల్డర్ 830 పాయింట్స్ తో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలిటెస్టులో 3 వికెట్లు తీసిన భారత్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం పడిపోయి 765 పాయింట్స్ తో 9వ ర్యాంకులో నిలిచాడు. భారత్ జట్టు తరఫున టాప్-10 ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే ఉన్నాడు. టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా 3, అశ్విన్ 5వ స్థానాల్లో కొనసాగుతున్నారు. అలాగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ (360) పాయింట్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆతర్వాత ఆస్ట్రేలియా (296), న్యూజిలాండ్ (120) పాయింట్స్ తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి 29న క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. తోలిటెస్టులో పరాజయం పాలవ్వడంతో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.