ఢిల్లీ మద్యం కేసులో వివరణకు సంబంధించి టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత మెయిల్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా సమాధానం ఇచ్చింది. ఎమ్మెల్సీ కవిత వివరణ తీసుకోడానికి, స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సీబీఐ బృందం 2022, డిసెంబర్ 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఆమె నివాసానికి రానున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో 11వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఆమె అందుబాటులో ఉండే విషయాన్ని నిర్ధారించాలని సీబీఐ అధికారులు సూచించారు.
ముందుగా ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత ప్రతిస్పందిస్తూ, సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీ మరియు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి గత శనివారం ఆమె లేఖ రాశారు. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్‌ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు.
అనంతరం డిసెంబర్ 5న సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వష్టకు ఎమ్మెల్సీ కవిత మెయిల్ చేస్తూ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని, తన ముందస్తు షెడ్యూల్ కారణంగా డిసెంబర్ 6, మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనని తెలిపారు. డిసెంబర్ 11, 12, 14, 15వ తేదీల్లో ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని చెప్పారు. అయితే వీలైనంత త్వరగా తేదీలను నిర్ధారించాలని కోరారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పంపిన మెయిల్ కు సీబీఐ అధికారులు సమాధానం ఇస్తూ, డిసెంబర్ 11న ఉదయం 11గంటలకు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE