ఒడిశాలో ఘోరం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్ పై హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఝార్సుగూడ జిల్లా బ్రజరాజ్‌నగర్‌లోని గాంధీ చౌక్ సమీపంలో ఒక కార్యక్రమానికి హాజరైన క్రమంలో మంత్రి కిషోర్ దాస్ తన కారు నుండి దిగుతున్నప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంత్రి నబా దాస్‌ను వెంటనే జార్సుగూడలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి, తదుపరి చికిత్స కోసం భువనేశ్వర్‌కు విమానంలో తరలించారు. అయితే మంత్రిపై కాల్పులు జరిపింది ఒక పోలీస్ అధికారి కావడం గమనార్హం. పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా ఆయనను గుర్తించారు.
ఇక ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంత్రి నబా కిషోర్ దాస్ తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి ఛాతీకి ఎడమ వైపున బుల్లెట్లు తగిలాయని, వాటిని తొలిగించామని వైద్యులు తెలిపారు. అలాగే గుండె పంపింగ్ మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నామని, అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ మంత్రిని కాపాడలేకపోయామని అపోలో ఆసుపత్రి అధికారులు తెలిపారు. కాగా మరోవైపు గాంధీ చౌక్ పోలీసు ఔట్‌పోస్ట్‌లో నియమించబడిన నిందితుడు ఏఎస్ఐ గోపాల్ దాస్ మంత్రిపై కనీసం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పొలీసు వర్గాలు తెలిపాయి. ఇక ఈ కాల్పుల్లో మంత్రి దగ్గర నిలబడి ఉన్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ సహా మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE