ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలతో యువత ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. గత శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ఆరాంగర్ చౌరస్తాలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో రోడ్డుపై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ బాలరాజు సమయస్ఫూర్తితో స్పందించి వెంటనే సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రీససిటేషన్) చేశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ దీనిపై ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా బుధవారం మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ప్రారంభించారు.
సీపీఆర్ శిక్షణను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో సుమారు లక్ష మందికి సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని, అలాగే జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇటీవల డ్యాన్స్ చేస్తూ కొందరు, జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరికొందరు కుప్పకూలిన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూశానని, ఆ ప్రదేశాల్లో సీపీఆర్ శిక్షణ పొందిన వారు ఉంటే తప్పక వారి ప్రాణాలను కాపాడేవారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు వంటి ప్రదేశాల్లో సీపీఆర్ శిక్షణ పొందిన వారిని నియమించాలని సూచించారు. ఇక మరో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, సీపీఆర్ ప్రక్రియ ద్వారా దీనిని నివారించవచ్చని పేర్కొన్నారు. కార్డియాక్ అరెస్టు ఎవరికైనా రావొచ్చని, అది రావడానికి ప్రత్యేకించి ఒక సమయం, సందర్భం ఉండదని, అందుకే ఎక్కువ మందికి సీపీఆర్ చేసేందుకు అవగాహన, శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం అని, త్వరలోనే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వరకు దీనిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE