ఏపీలో రాజధానిగా ఉన్న అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో.. అమరావతిలోని ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. అక్కడ యథాతథ స్ధితి కొనసాగించాలని గురువారం ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వీటిపై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపు సందర్భంగా సుప్రీంకోర్టు అమరావతిపై ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఇవి ఉండాలని న్యాయస్థానం పేర్కొంది.
కానీ అక్కడ శాశ్వత కట్టడాలుగా ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో ఈ వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఇళ్ల నిర్మాణాన్ని తక్షణం నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు అమరావతి ఆర్5 జోన్‌లో యథాతథ స్ధితి కొనసాగించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు ముందు అమరావతిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు వేస్తున్న అడుగులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE