
పార్లమెంట్ ఎన్నికల వేళ.. అధికార, విపక్ష పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ప్రచార తీరులో మార్పు కనిపిస్తోంది. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ధోరణి ఉంటోంది. మాకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే.. ప్రజలే నష్టపోతారని, పథకాలు రావని, ఆస్తులు లాగేసుకుంటారని.. ఈ తరహా ప్రచారాలు కొనసాగుతున్నాయి. అలాగే ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడం తగ్గించి.. పొరపాటున ఆ పార్టీకి ఓటేస్తే.. ఫలానా నష్టం జరుగుతుందని చెప్పేందుకే పార్టీల నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకు ఇదే ధోరణి అవలంబిస్తున్నాయి.
‘‘కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతోంది. ఉన్నోళ్ల నుంచి సంపద తీసుకుని పంచేస్తారు. మహిళల మెళ్లో మంగళసూత్రాలు కూడా మిగలనివ్వరు’’ అంటూ సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ సభలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వస్తే ప్రజల సంపదను లూటీ చేసి, మైనారిటీలకు పంచుతుందని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ మోదీ అంతటితో ఆగలేదు. కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రజల ఆదాయం, సంపదపై కన్నేశాయని ప్రచారం చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అనే దానిపై విచారణ జరిపిస్తామని ఆ పార్టీ యువరాజు చెప్పారు. అలాగే ప్రజలు సంపదపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, వారి ఆస్తులను అందరికీ పంచుతామనీ మేనిఫెస్టోలో చెప్పారు’’ అంటూ రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలాగే.. రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. 400 లోక్ సభ స్థానాల్లో గెలిస్తే ఎవరి అవసరం లేకుండా రిజర్వేషన్లను రద్దు చేయవచ్చుననేది బీజేపీ కుట్ర అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2025తో ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లవుతుందని, ఆ సందర్భంగా రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆర్ ఎస్ఎస్ ప్రతిపాదించిందని ప్రచారం చేస్తున్నారు. ఆ మేరకు బీజేపీ నడుచుకుంటోందని పేర్కొంటున్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయని కాంగ్రెస్ సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. భారత్‌ను రిజర్వేషన్ రహిత… హిందూదేశంగా మార్చాలని ఆరెస్సెస్ ఎప్పుడో చెప్పిందని, ఇందుకోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అధికార, విపక్షాలు ప్రచార పర్వంతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఎవరి చెప్పేది నిజమో.. కాదో, ఎవరిని నమ్మాలో తెలియని స్థితిలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY