
ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఏపీకి చెందిన ముగ్గురు ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రం నెల రోజులుగా ఎక్కడా కన్పించడం లేదన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆ తర్వాత మరి కొద్ది రోజులు కనిపించిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి తర్వాత ఎన్నికల హీటులో మాత్రం చూద్దామన్నా కనిపించడం లేదు.
ఈ ఎన్నికలో సీట్లు ఆశించిన ఈ ముగ్గురు నేతలు .. అసంతృప్తికి గురయ్యారని..అందుకే వీళ్లు ప్రధానమంత్రి సభలకు కూడా రావడం లదేన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో సఖ్యతలేకపోవడం వల్ల కూడా..ఈ ముగ్గురు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అధికార పార్టీతో పాటు టీడీపీపై ఒంటికాలిపై లేచే జీవీఎల్ నర్శింహారావు, సోము వీర్రాజు అవసరం అయినప్పుడు సైలెంటవవడంపై చర్చలు జరుగుతున్నాయి.
2014 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఎమ్మెల్యే పదవులతోపాటు ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు మూడేళ్లపాటు టీడీపీ మంచి పరిపాలన అందించిందని అనేవారు. కానీ 2019 జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాక.. అధికారపార్టీపై పోరాటం చేయాల్సిన సోము వీర్రాజు.. పవర్‌లేని ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేశారు.
అయితే 2024 ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరికి ఢిల్లీ పెద్దలు అధ్యక్ష పదవిని కట్టబెట్టిన దగ్గర నుంచి నుంచి సోము వీర్రాజు పత్తా లేకుండా పోయారు. దీనికి తోడు రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్తిగా బరిలో దిగుతున్న పురందేశ్వరి అక్కడ సోము వీర్రాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం కాకుండా సొంతంగా పార్టీ ఆఫీసున ఏర్పాటు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అసలు సోము వీర్రాజుకు టికెట్ రాకుండా చేసింది పురందేశ్వరి అన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. దీంతోనే అప్పటినుంచి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ సోము ఉండటం లేదు.
ఏపీకి చెందిన జీవీఎల్ నర్శింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.అయితే జీవీఎల్ కూడా టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాఆ పార్టీనే ఎప్పుడూ టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఈ సారి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి పావులు కదపగా.. ఎన్డీఏ కూటమిలో ఆ సీటు బీజేపీకి కాకుండా టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు ఈ సీటు దక్కింది. దీని వెనుక కూడా పురందేశ్వరి ఉందన్న నమ్మకంలో జీవీఎల్ ఉన్నారు. దీంతోనే జీవీఎల్ కూడా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనలతో బీజేపీ కూటమి కట్టే అవకాశమే లేదని చివరి నిమిషయం వరకూ చెబుతూ వచ్చారు విష్ణువర్థన్‌రెడ్డి. అనంతపురం జిల్లాలో ఏదొక చోట సీటు ఇస్తే పోటీ చేయాలని ఆశపడినా.. బీజేపీ పెద్దలు మాత్రం ఆయనకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేసారు. దీంతో కినుక వహించిన విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, చివరకు అత్యంత ముఖ్యమయిన ప్రచారంలో కూడా కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY