
తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ, ఎన్నికల హడావుడి ముగియడంతో జూన్ 4న విడుదలయ్యే లోక్ సభ ఫలితాల కోసం నేతలంతా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుండడంతో పట్టభద్రులను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు కసరత్తులు చేస్తున్నారు.
నేటితో ప్రచారానికి తెర పడనుండటంతో.. అగ్రనేతలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఓరుగల్లుకు తరలివెళ్లి పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం.. ముఖ్యనేతలంతా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రలోభాలు జోరందుకున్నాయి.
అగ్ర పార్టీల ముఖ్య నాయకులంతా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూనే..తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాలు, మండలాలు గ్రామాల వారీగా కేడర్‌ను కలిసి అభ్యర్థుల గెలుపునకు మద్దతు కూడగట్టడానికి పావులు కదుపుతున్నారు. ఈనెల 27న జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52 మంది పోటీలో నిలబడుతున్నారు. .
తెలంగాణలో మే 27న నల్గొండ,వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలకు ప్రచారం సమయం నేటితో ముగియనుండటంతో పట్టభద్రులు ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు తంటాలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు తలపడుతుండటంతో..ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం, ప్రలోభాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో… తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక ఆవశ్యకత వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా ఏనుగల రాకేష్ రెడ్డి పోటీ పడుతున్నారు.
మరోవైపు నల్గొండ,వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని వైన్ షాపులు, బార్లు రెండు రోజులు మూతపడున్నట్లు ఈసీ నుంచి ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. మే 25వ తేదీ అంటే ఆదివారం సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు మూసివేసి ఉంటాయి.48 గంటల పాటు మూసి ఉండే వైన్ షాప్స్ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY