ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న ఈ సమయంలో పిఠాపురంలో స్టిక్కర్ల యద్ధం కాకరేపుతోంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే ఉంది.
నిజానికి ఏపీ ఎన్నికలలో గెలుపోటములు ఒక ఎత్తయితే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఒక ఎత్తు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారున్న ప్రతీ చోటా కూడా పిఠాపురం నియోజకవర్గం గురించే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. వెనుకడుగు వేయకుండా మళ్లీ ఈ ఎన్నికలలో పోటీ చేయడంతో పాటు..పిఠాపురం బరి నుంచి పోటీకి దిగడంతో అందరి చూపూ అటే పడింది.
అయితే ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అన్న నమ్మకంతో జనసేన అభిమానులు కొంత మంది తమ బైక్‌లు, కార్లు, ఆటోలపై ఫలితాలకు ముందే మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని రాయించుకుంటున్నారు. మరికొంతమంది అయితే పిఠాపురం జనసేన ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ తమ వెహికల్స్ పై రేడియం స్టిక్కర్లు కూడా వేసుకుంటున్నారు.
మరోవైపు వైఎస్సార్సీపీ అభిమానులు డిప్యూటీ సీఎం వంగా గీత అని తమ వాహనాలపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో ఈ హడావుడి మొదలైందంటూ నియోజకవర్గంలో చర్చలు జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా తమ అభిమానాన్ని చాటుకోవడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది.
పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయగా..వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా వంగా గీత బరిలో నిలిచారు. అయితే వంగా గీతను కనుక గెలిపిస్తే ఆమెనను డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో ఆమె అభిమానులు డిప్యూటీ సీఎం అని స్టిక్టర్ వేయించుకుంటున్నారు. ఇక పవన్ అభిమానులతో పోల్చుకుంటే ఆమె స్టిక్కర్లు తక్కువేనన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY