
అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఓటర్లు అదే రేంజ్‌లో బుద్ధి చెబుతారన్నది రాజకీయాలలో జగమెరిగిన సత్యం. ఇప్పుడు కొడాలి నాని విషయంలోనూ ఇదే జరిగింది. గుడివాడ నియోజకవర్గం తన అడ్డా అన్నంతగా రెచ్చిపోయిన కొడాలి నాని కంచుకోటను ఇప్పుడు ఏపీ ఓటర్లు బద్దలుకొట్టేసారు. నిజమే రెండు దశాబ్దాలకు పైగా గుడివాడను తన కంచుకోటగా చేసుకున్న కొడాలి నాని.. పార్టీలతో సంబంధం లేకుండా వరుసగా నాలుగుసార్లు గెలుస్తూ వచ్చారు.
గత రెండు ఎన్నికలలోను వైస్సార్సీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ కేబినెట్‌లో తొలి మూడేళ్లు మంత్రిగానూ పనిచేశారు. వైసీపీలోకి వెళ్లాక ..ఒకప్పుడు టీడీపీ నేతన్న విషయాన్ని మరిచిపోయిన నాని.. చంద్రబాబు , లోకేష్‌పై లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు చేయడంతో.. ఏపీ వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులకు ఈసారి టార్గెట్ అయ్యారన్నది అక్షర సత్యం. ఇటు ఓటర్లు కూడా కొడాలి నాని వైఖరిని పబ్లిక్ గానే విమర్శించేలా చేసుకున్నారు.
ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి కొడాలిని గుడివాడలో ఎలాగైనా ఓడించి టీడీపీ జెండా రెపరెపలాడించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. దీనికోసమే ముందుగా గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు ఏడాది క్రితమే పార్టీ పగ్గాలు అప్పగించారు. రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రాము భార్య సుఖద మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం రాముకి కలిసొచ్చింది. గుడివాడలో ఎస్సీ సామాజిక వర్గాలు కూడా టీడీపీ వైపు మొగ్గుచూపించడానికి ఇది కూడా ఒక కారణమే.
పోటాపోటీగా జరిగిన గుడివాడ సమరంలో అంతిమ విజేతగా వెనిగండ్ల రాము నిలవడంతో కొడాలి నానిని అక్కడి వారు ఎంతగా వ్యతిరేకించారో అర్ధం అయింది. 13 రౌండ్లకే ఏకంగా 44 వేల పై చిలుకు మెజార్టీ రావడంతో..కొడాలి నానికి ఇది జీవితంలో మర్చిపోలేని ఘోర అవమానమే నంటూ సోషల్ మీడియాలో కూటమి శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు. ఎగిరెగిరి పడితే ప్రజలు ఇలాగే బుద్ది చెబుతారంటూ.. ఇప్పటికైనా నాని తన నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY