కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరిని కేంద్ర మంత్రి పదవి వరించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈక్రమంలో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని మరో కీలక నేతకు అప్పగించేందుకు బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ కీలక నేతను ఎంపిక చేశారని.. రేపో, మాపో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు కీలక వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయనకు మరోసారి సెంట్రల్ కేబినెట్లో చోటు దక్కింది. ఆదివారం ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈక్రమంలో ఆయన్ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ను నియమించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ రెండు స్థానాల నుంచి ఈటల పోటీ చేసి ఓడిపోయారు. ఈక్రమంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. ఈక్రమంలో ఆయనకే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని హైకమాండ్ చూస్తోందట.
ఇప్పటికే ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దల నుంచి ఈటల రాజేందర్‌కు పిలుపు వచ్చిందట. సోమవారం అమిత్ షాతో ఈటల భేటీ కానున్నారట. అంతకంటే ముందు అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై చర్చలు జరిపారట. తెలంగాణలో ఈటలకు మాస్ లీడర్‌గా పేరు ఉండడంతో పాటు.. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా పేరు ఉండడంతో ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. అమిత్ షాతో ఈటల సమావేశమయిన తర్వాత.. అధ్యక్ష బాధ్యతలు అప్పగింతపై స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY