తెలుగు మంత్రులకు కీలక శాఖలు అప్పగించిన మోడీ

ministers portfolios, Modi 3.0, central government, bjp
ministers portfolios, Modi 3.0, central government, bjp

కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆదివారం వరుసగా మూడోసారి ప్రధానిగా.. నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే  ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే అత్యంత కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను బీజేపీ తమ వద్దే పెట్టుకుంది. మరోసారి అమిత్ షాకు హోంశాఖను.. నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను.. ఎస్.జైశంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను.. రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ శాఖను కేటాయించారు.

కొత్తగా కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న 30 మందిలో… 19 మంది పాతవారే ఉండగా… అందులో 12 మందికి పాతశాఖలే దక్కాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారికి కూడా సోమవారం శాఖలను కేటాయించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కీలకమైన బొగ్గు, గనులశాఖను అప్పగించారు. గతంలో కిషన్ రెడ్డి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన్ను ఆ శాఖల నుంచి తప్పించి బొగ్గు, గనుల శాఖను అప్పగించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. గతంలో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందడానికి ముందు హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పౌర విమానయాన శాఖ దక్కింది. గతంలో 2014-18 వరకు ఉత్తరాంధ్రకు చెందిన చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ శాఖ మంత్రిగా పనిచేశారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు మిరంత వేగంగా పూర్తి చేసేందుకు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరిన్ని విమాన సర్వీసులను విజయవాడ, విశాఖ, తిరుపతిలకు తీసుకు రావాల్సి ఉంటుంది. సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ల శాఖలను అప్పగించారు. అలాగే ఏపీ నుంచి సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరో ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖలను కేటాయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE