ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన కేబినెట్‌ను ఎంచుకున్నారు. మొత్తం 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకోగా.. అందులో 17 మంది కొత్తవారే ఉన్నారు. ఎక్కువగా జూనియర్లకు ఈసారి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో అవకాశం కల్పించారు. దీంతో మంత్రి కుర్చీపై ఆశలు పెట్టుకున్న కొందరు సీనియర్లు అలకభూనారాని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో చంద్రబాబు నాయుడు, అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు.
మంత్రి పదవి తనకు దక్కకపోతే ఎందుకు అసంతృప్తి ఉంటుందని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని.. పదవులు దక్కినా, దక్కకపోయినా ఆ పార్టీకి తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో తాను పాతికేళ్ల వయస్సులోనే మంత్రిని అయ్యానని గుర్తు చేసుకున్నారు. తాను పాతికేళ్ల వయస్సులో మంత్రిని అయితే.. ఆనాడు సీనియర్లు అలిగారా అని ప్రశ్నించారు. కొత్తవారికి మంత్రి పదవులు రావడం పట్ల తాను మనస్ఫూర్తిగా సంతోషిస్తానని.. వారికి తన పూర్తి మద్ధతు ఉంటుందని చెప్పుకొచ్చారు.
కొత్తవారికి పదవులు ఇస్తే సీనియర్ నేతలు బాధపడరని.. పైగా ఆనందిస్తారని వెల్లడించారు. పార్టీలో జూనియర్లు ఎదగాలనే తామంతా ఎల్లప్పుడూ కోరుకుంటామని చెప్పుకొచ్చారు. ఇంకా పాతవారే పదవుల్లో కొనసాగితే కొత్తవారికి అవకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ కోసం తాను ప్రాణాలయినా అర్పించేందుకు సిద్ధమని వెల్లడించారు. గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసు అధికారులు మితిమీరి ప్రవర్తించారని చెప్పారు. ఆ అధికారుల జాబితా తమ వద్ద ఉందని.. వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరామని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE