ఎన్నికల్లో సక్సెస్ ఫుల్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. ఈ హామీని ఇచ్చిన అన్ని పార్టీలు దాదాపు అధికారంలోకి వచ్చాయి. కర్ణాటక, తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఇచ్చింది. ఈ హామీ విస్తృతంగా జనాల్లోకి వెళ్లి.. మహిళలను ఆకట్టుకోవడంతో ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నేరవేర్చారు. ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని గుప్పిచ్చింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో.. ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ఈ హామీని నెరవేర్చాలని వేగంగా అడుగులేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలనే అనుసరించాలని బాబు నిర్ణయించారు. ఈ మేరకు అయిదుగురు సభ్యులతో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విధివిధానాలపై ఓ నివేదికను రూపొందించాలని వారికి చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఆ కమిటీ నివేదికను రూపొందించే పనిలో ఉంది. త్వరలోనే చంద్రబాబుకు నివేదికను అందించనుంది.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జూలై 1 నుంచే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ హామీని ఎలా అమలు చేయాలనే దానిపై చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారట. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బ తింటుందని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు సచివాలయం ఎదుట ధర్నా చేశారు. ఈక్రమంలో ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా హామీని నెరవేర్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE