ఏపీలో ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారం కోల్పోయి టీడీపీ కూటమి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈక్రమంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన కొందరు అధికారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఉద్యోగం, పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక.. ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్నారు. ఇదే సమయంలో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చేస్తే సక్రమంగా పనిచేయండి.. లేదంటే వైసీపీ కండువాలు కప్పుకొని ఆ పార్టీ సేవలో తరించండి అంటూ హెచ్చరించారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక.. వంగలపూడి అనితను చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. హోం శాఖను ఆమెకు కట్టబెట్టారు. త్వరలోనే హోం శాఖ మంత్రిగా అనిత బాధ్యతలను తీసుకోనున్నారు. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను అనిత సందర్శిస్తున్నారు. పనిలో పనిగా ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లను కూడా సందర్శిస్తున్నారు. ఇటీవల విశాఖలోని సింహాచలం అప్పన్న దేవాలయాన్ని అనిత సందర్శించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కొందరు పోలీసులు ఇంకా తమ తీరును మార్చుకోలేదని.. ఇప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వారు తమ పోలీస్ యూనిఫాంను తీసేసి.. వైసీపీ కండువాలు కప్పుకొని రాజకీయాల్లో చేరాలని హెచ్చరించారు. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకునేలోపే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాను ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. ఇప్పటికి కూడా గంజాయి రవాణా, విక్రయాల విషయంలో కేసులు నమోదవుతుంటే.. వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని కొందరు పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అటువంటి వాళ్లు వెంటనే తమ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో మూడు నెలల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని.. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని అనిత చెప్పారు. గతంలో ఒక టీచర్‌గా ఎంతో మంది విద్యార్థులను సరిదిద్దానని.. ఇప్పుడు వ్యవస్థను కూడా సరిదిద్దుతానని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE