
ఏపీ నుంచి ప్రతీ రోజూ ప్రయాణించే వేలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేర్చే కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. రెండు రోజులు కాదు.. వారం రోజులు కాదు ఏకంగా 47 రోజులపాటు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎప్పుడూ ఇన్ని రోజులు ఆ మూడు రైళ్లను రద్దు చేయని రైల్వే శాఖ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ఏడాదిగా భద్రతా పరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతోనే తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తూ వచ్చారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులెవరూ పెద్దగా ఇబ్బందులు పడలేదు.కానీ ఇప్పుడు వాటిని కూడా రద్దు చేయడంపై..అది కూడా 47 రోజుల పాటు రద్దు చేయడంతో ఏపీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం నుంచి అన్నవరం, రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో ఎక్కువ మంది జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణిస్తారు. ఒక్కో రైలులో రోజుకు 3 వేల మంది ప్రయాణం అంటే.. మూడు రైళ్లు సుమారు 6 నుంచి 9వేల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఉదయ్, రాయగడ ఎక్స్‌ప్రెస్‌లను కూడా తీసుకుంటే ఈ సంఖ్య 10 నుంచి 12 వేల వరకు ఉంటుంది. రానుపోను ప్రయాణికులను లెక్కేస్తే రోజుకు 20 వేల మంది పైనే ఆ రైళ్లపైన ఆధాపడుతున్నారు. అలాంటి రైళ్లను ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు రైళ్లల్లో కనీసం ఒక్క రైలు అయినా నడపాలని ..లేకపోతే వేలాది మంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
విశాఖ పట్నం స్టేషన్ మీదుగా రోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిల్లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, పాసింజర్‌లు ఉంటాయి.అయితే హావ్‌డా, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రం యథావిధిగా నడుపుతున్న రైల్వే శాఖ.. కేవలం విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, గుంటూరు వెళ్లే రైళ్లనే రద్దు చేస్తామని ప్రకటించడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. వాటిని పూర్తిగా రద్దు చేయకుండా కనీసం రాజమండ్రి వరకు నడిపినా బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.
విశాఖపట్నం నుంచి విజయవాడకు జన్మభూమి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్ సిటింగ్ సీటు టికెట్ ధర రూ.150మాత్రమే.. కానీ అదే ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే రూ.600పైనే ఖర్చవుతాయి. దీంతోనే ఇప్పుడు ఈ మూడు రైళ్లను రద్దు చేస్తూ.. రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికే వాల్తేరు డివిజన్ అధికారులకు దీనిపై నిరసన సెగ మొదలైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY