ఎట్టకేలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపులతో అలక వీడారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను బుజ్జగించినప్పటికీ.. మెండి పట్టు పట్టిన జీవన్ రెడ్డి చివరికి హైకమాండ్ రంగంలోకి దిగడంతో ఓ మెట్టు దిగారు. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే తన నియోజకవర్గానికి చెందిన నేతను తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు. తన ప్రమేయం లేకుండా ఎలా సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకుంటారని ఆందోళనకు దిగారు.
ఈ మేరకు త్వరలోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లో ఉండాలా? లేదా? అన్నది ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు. అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌లు జీవన్ రెడ్డికి వెళ్లి అయనతో చర్చలు జరిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని.. హైకమాండ్‌తో మాట్లాడి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ రంగంలోకి దిగారు. స్వయంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బుధవారం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. వారు దీపాదాస్ మున్షీతో సమావేశమయిన తర్వాత.. ఢిల్లీకి రావాల్సిందిగా జీవన్ రెడ్డికి కబురు పంపారు. వెంటనే ఆయన కూడా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడ పార్టీ పెద్దలైన కేసీ వేణుగోపాల్‌తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి తన మనసు మార్చుకొని.. తన రాజీనామా నిర్ణయాన్నా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు పార్టీయే ముఖ్యమని వెల్లడించారు. రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పవని జీవన్ రెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ