వైసీపీకి ఈసారి లోక్ సభలో కేవలం నలుగురు ఎంపీల బలం మాత్రమే ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు ఆ నలుగురు ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని కొద్దిరోజులగా ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి వైసీపీ తీవ్ర కష్టాల్లో ఉంది. మరోవైపు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వైసీపీ చిక్కులను ఎదుర్కోక తప్పేట్లు లేదు. దీంతో వైసీపీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే కాషాయపు కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో వైసీపీకి చెందిన నలుగురు లోక్ సభ ఎంపీలు.. పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు త్వరలోనే మోడీని కలవనున్నారని ఇటీవల కొత్త వార్త పుట్టుకొచ్చింది. బీజేపీలో చేరడంపై చర్చించేందుకే వారు ప్రధానిని కలుస్తున్నారని మరో వార్త వైరల్ అయింది. అయితే ముందు నుంచి కూడా వైసీపీ ఎంపీలు తాము బీజేపీలో చేరేది లేదని చెబుతున్నారు. ఇటీవల ఎంపీలు మిథన్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు స్పందిస్తూ.. తమకు బీజేపీల చేరే ఖర్మ పట్టలేదని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితోనే ఉంటామని.. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరుపున పోరాడుతామని వెల్లడించారు. అయినప్పటికి కూడా వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారానికి మాత్రం చెక్ పడడం లేదు.
తాజాగా ఇదే అంశంపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. అటువంటి ఆలోచనకానీ , ప్రతిపాదన కానీ లేదని వెల్లడించారు. కొద్దిరోజులుగా వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదం అని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ