అన్నీ ఉన్నప్పుడు.. అధికారంలో ఉన్నప్పుడు అందరూ దగ్గరికి వస్తారు. హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. పదవుల కోసం ఎగబడుతుంటారు. కానీ ఒక్కసారి అధికారం దూరమైతే.. మన అనుకున్న వారు కూడా దూరమవుతుంటారు. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతారు. పదువులు ఇస్తామన్నా.. వద్దు బాబు.. మాకొద్దు అని అంటారు. ప్రస్తుతం ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ పరిస్థితి అలానే ఉంది. గడిచిన అయిదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం ఎగబడ్డారు. కొట్లాడుకున్నారు. హైకమాండ్‌కు దగ్గరవ్వడం కోసం ఎన్ని చేయాలో.. అన్ని ప్రయత్నాలు చేశారు. అయిదేళ్లు పదవులను అనుభవించారు. చేతినిండా సంపాదించుకున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయాక.. పదువులు ఇస్తామంటే కూడా మాకొద్దంటే వద్దని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. టీడీపీ కూటమి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే.. అటు సైడ్ నుంచి వైసీపీకి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారంలోకి రాగానే తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చేసింది. జిల్లాల వారీగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలను కూడా కూల్చేందుకు ప్రయత్నించగా.. హైకోర్టు దానిపై స్టే విధించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీపై పెద్ద ఎత్తున కక్ష్య సాధింపు చర్యలకు దిగింది. ఈక్రమంలో ఇప్పుడు వైసీపీకి ఒత్తిళ్లు తగ్గేలా కనిపించడం లేదు.
అయితే పార్టీని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా కొత్త అధ్యక్షులను నియమించాలని నిర్ణయించారు. కొత్తవారికంటే.. గతంలో మంత్రులుగా పని చేసిన వారికి పదవులు ఇస్తే.. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్లను వారు ఎదుర్కోగలరని జగన్ భావిస్తున్నారు. అలాగే అంగ బలం అర్థ బలం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే.. సంస్థాగతంగా వీలైనంత త్వరగా పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్నారట. అయితే మాజీ మంత్రులు మాత్రం పదవులు మాకొద్దంటే వద్దు అని అంటున్నారట. పార్టీ అధికారంలో లేనందున ఇకపై విలాసాలు ఉండవు. చేతుల నిండా సంపాదించుకునేందుకు అవకాశం ఉండదు. పైగా ప్రభుత్వం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. అంతేకాకుండా జేబులో నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అందుకే తమకు పదవులు వద్దంటే వద్దని అంటున్నారట మాజీ మంత్రులు. హైకమాండ్ ఇస్తామంటున్నా కూడా వారు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాకుండా కొత్త వ్యక్తులకు పదవులు ఇవ్వాలని వారు హైకమాండ్‌కు సూచిస్తున్నారట. మేము సలహాలు ఇస్తూ వారి వెనుక అండగా ఉంటామని చెబుతున్నారట. అయితే ఇన్నిరోజులు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభించిన నేతలు.. కష్టకాలంలో మొండి చేయి చూపిస్తుండడంతో హైకమాండ్‌కు మింగుడు పడడం లేదట. మరి చూడాలి ముందు ముందు వైసీపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE