ఉద్యమ పార్టీగా.. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్‌కు పేరుంది. తెలంగాణ తీసుకొచ్చిన సెంటిమెంట్‌తో పదేళ్లు ఆ పార్టీ అధికారంలో కొనసాగింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొద్దిరోజులుగా ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడోసారి అధికారం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావించారు. కానీ ఈసారి మరింత బోల్తా పడింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. పార్టీ పెట్టినప్పటి నుంచి లోక్ సభలో బీఆర్ఎస్‌కు స్థానం లేకపోవడం ఇదే తొలిసారి.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. అప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో కీలక నేత అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు బీర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా.. చిన్న క్లూ కూడా లేకుండా ఇటీవల రాత్రికి రాత్రే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. అటు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు.
రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి.. మరికొందరు బీజేపీలోకి జంప్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రోజురోజుకు బీఆర్ఎస్ పతనమయిపోయింది. అటు కేసీఆర్ పార్టీని.. నేతలను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో వరుసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. వారికి అండగా అంటానని భరోసా కల్పిస్తున్నారు. అయిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని అందులో ఎటువంటి అనుమానం లేదని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ.. పార్టీకి జరిగే డ్యామేజ్ మాత్రం జరిగిపోతూనే ఉంది. దానికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ భవిష్యత్తు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
ఈక్రమంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని సిద్ధమయ్యారట. ఒకవేళ వృద్ధాప్య సమస్యలు.. ఇతర అనారోగ్య కారణల దృష్ట్యా చేయలేకపోతే.. తన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఈ పాదయాత్రను కొనసాగించనున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రజలకు వివరిస్తూ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లనున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE