దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో కీలక సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు రాజేశ్ రంజన్ అలియాస్ రాకీని పాట్నాలో గురువారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో బీహార్‌లోని పాట్నాలో రెండు చోట్ల, కోల్‌కతాలోని మరికొన్ని ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని విచారించడానికి స్థానిక కోర్టు 10 రోజుల పాటు సీబీఐ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటికే జులై 10న ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాకీ అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 12 మందికి చేరింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ రాకెట్‌పై ఎంక్వైరీ బాధ్యతలను చేపట్టిన సీబీఐ..ఇప్పటి వరకూ ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తమ నివేదికలో తెలియ చేసింది. నీట్ పేపర్ లీకేజీకి హజారీబాగ్ స్కూల్‌తో సంబంధాలు ఉన్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి లీకైన పేపర్లు బీహార్‌కు చేరుకున్నాయని ఓ సీబీఐ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా పేపర్ లీకైన విధానాన్ని ఆ అధికారి వివరించారు. మే 5న జరిగిన ఎగ్జామ్‌కు సంబంధించిన తొమ్మిది సెట్ల పేపర్లు భద్రపరచడానికి రెండు రోజుల ముందుగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు నీట్ యూపీ క్వశ్చన్ పేపర్లు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఎగ్జామ్ కేంద్రంగా ఉన్న హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలకు రెండు సెట్లను తరలించారు. అయితే స్కూలుకు చేరుకున్నప్పుడు వాటిని పరిశీలిస్తే వాటికి ఉండాల్సిన సీల్స్ తొలగించి ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్ సీల్ చేయని సమయంలో రాకీ అక్కడ ఉన్నట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయని సీబీఐ అధికారి చెప్పారు. రాఖీ ఆ పేపర్లను ఫోటోలు తీసి వాటికి ఓ ముఠాకు చేరవేశాడు. అలా ఆ ఎగ్జామ్ పేపర్‌కు సమాధానాలు గుర్తించిన తర్వాత నీట్ కేండిడేట్లతో బేరసారాలు చేసి, లక్షల్లో దోచుకున్నారని అన్నారు.
పదేళ్లుగా పేపర్ స్కామ్‌లో పరారీలో ఉన్న నీట్ పేపర్ రాకెట్‌లోని మరో కీలక వ్యక్తి సంజీవ్ ముఖియాతోనూ ఆ రాకీ టచ్‌లో ఉన్నాడు. అయితే పూర్తిగా విచారిస్తేనే ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందనే విషయం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ రెండు చోట్ల ఈ నీట్ పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎగ్జామ్ పేపర్లు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో స్పష్టంగా తెలియకపోయినా..బ్యాంకు బ్రాంచ్ నుంచి పాఠశాలకు చేర్చే సమయంలో మార్గమధ్యలో పేపర్ బయటకు వచ్చి ఉంటుందని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ఎంట్రన్స్ కోసం..ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రిజల్డ్ ప్రకటించిన తర్వాత 67 మందికి ఫస్ట్ ర్యాంకులు రావడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాదు వీరిలో ఒకే కోచింగ్ సెంటర్లో 720 మార్కులు సాధించిన ఆరుమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి.
అంతేకాకుండా ప్రశ్నపత్రం ఆలస్యంగా అందించారన్న కారణంతో 1,563 మంది స్టూడెంట్స్ కు గ్రేస్ మార్కులు కలపడం కూడా వివాదానికి దారి తీసింది. అలా గ్రేస్ మార్కులు ఇచ్చిన అభ్యర్ధులందరికీ రీటెస్ట్ పెట్టి, కొత్త ర్యాంకులు ప్రకటించినా కూడా ఇప్పుడు పేపర్ లీకేజీ వ్యవహారం తేలాల్సి ఉంది. అందుకే నీట్ పరీక్షను మరోసారి పెట్టాలని డిమాండ్లు వస్తున్నా కూడా కేంద్రం మాత్రం..ఈ పేపర్ లీకేజ్ స్థానికంగానే ఉందని చెబుతూ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఎగ్జామ్ పేపర్లు షేర్ చేయలేదని చెబుతోంది. మరోవైపు దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ల విచారణను జులై 18కి వాయిదా పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE