తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పుట్టెడు కష్టాల్లో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటలని ఆ పార్టీ ప్రయత్నించింది. కానీ మరోసారి బీఆర్ఎస్కు ఊహించని దెబ్బ తగిలింది. వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. మెజార్టీ స్థానాలను దక్కించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ పావులు కదిపినప్పటికీ.. ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టి.. బీఆర్ఎస్ను మరింత కుంగతీస్తోంది. ఆ పార్టీ నామరూపాలు లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కొక్కరుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. కీలక నేతలను తమవైపు లాక్కుంటోంది.
అయితే ఇన్నిరోజులుగా కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. బీజేపీ కూడా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రంలో మోడీ సర్కార్‌ను గద్దె దించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో మోడీ సర్కార్‌పై మాటల తూటాలు పేలుస్తూ.. పెద్ద యుద్ధమే చేశారు. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు సమయం కోసం చూస్తోంది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. వంద రోజులకు పైగా కవిత జైలులోనే ఉన్నారు. కవితను అరెస్ట్ చేయించి ఇప్పటికే మోడీ సర్కార్.. బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టింది. ఇప్పుడు రాజ్యసభలోని బీఆర్ఎస్ ఎంపీలను తమవైపు లాక్కోవాలని చూస్తోంది. అటు లోక్ సభలో ఎలాగూ బీఆర్ఎస్కు బలం లేదు. రాజ్యసభలో కూడా బీఆర్ఎస్కు స్థానం లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. నలుగురు రాజ్యసభ బీఆర్ఎస్ ఎంపీలకు ఇప్పటికే బీజేపీ గాలం వేసిందట. త్వరలోనే వారు బీజేపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ ముందు ముందు మరిన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ