భారతదేశంలో 2020లో నమోదు అయిన కరోనా మరణాల్లో.. సుమారు 11.9 లక్షల మరణాలు ఎక్కువగా రికార్డు అయినట్లు కొత్తగా చేపట్టిన సర్వేతో వెల్లడైంది. అధికారిక లెక్కల కన్నా ఆ మరణాల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేల్చారు. కరోనా మహమ్మారి వచ్చిన తొలి ఏడాది ఆదివాసీలు, దళితులు, ముస్లిం జనాభాల్లో ఎక్కువ శాతం మరణాల సంభవించినట్లు రిపోర్టులో తెలిపారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు తేల్చారు.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సోసియాలజిస్ట్ టీమ్, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీకి చెందిన ఎకానమిస్ట్ టీమ్ దీనిపై స్టడీ చేసింది. వయసు, జెండర్, సామాజిక వ్యత్యాసం ఉన్న వారిపై కరోనా వల్ల ఎటువంటి ప్రభావం పడిందన్న కోణంలో ఈ స్టడీ చేశారు. మహిళలతో పాటు అణగారిన వర్గాల వారి .. ఆయుర్ధాయం ఎక్కువగా తగ్గినట్లు స్టడీలో అంచనా వేశారు. వివిధ సామాజిక వర్గాల్లో జీవితకాలం తగ్గిన వారిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లిం ఆయుర్ధాయం 5.4 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేసిన అద్యయన కర్తలు..ఆ తర్వాత జాబితాలో ఎస్టీలు 4.1 ఏళ్లు, ఎస్సీలు 2.7 ఏళ్లు తగ్గినట్లు నిర్ధారించారు. ఇక హిందువుల్లోని ఉన్నత కులాలు, ఓబీసీల జీవితకాలం కేవలం 1.3 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేశారు.
2019-21 మధ్య చేపట్టిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 రిపోర్ట్ ఆధారంగా స్టడీ చేశారు. ఇండియాలో మహిళల ఆయుర్ధాయం 3.1 ఏళ్లు, మగవారి ఆయుర్ధాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు భావించారు. అయితే సగటున భారత దేశంలో జీవితకాలం 2.6 ఏళ్లు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.కరోనా మహమ్మారి వల్ల ఇండియాలో మహిళలపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు కరోనా సమయంలో ఇండియాలో జరిగిన మార్పులు మరే ఇతర దేశంలో నమోదు కానట్లు అంచనా వేశారు.
2020లో దేశంలోని మహిళల్లో మరణాలు 17 శాతం ఎక్కువగా నమోదు అయినట్లు అధ్యయనంలో తెలిపారు. భారత్ లో అత్యధికంగా ఆయుర్దాయం తగ్గినట్లు సిటీ యూనివర్సిటీ ఎకానమిస్ట్ ఒకరు తెలిపారు. ఇండియా తరహాలోనే నల్లజాతీయులు, హిస్‌పానిక్స్, నేటివ్ అమెరికన్లలో కూడా కరోనా సమయంలో జీవిత కాలం తగ్గినట్లు అధ్యయనంలో తేల్చారు. సైన్స్ అడ్వాన్సెస్ అన్న జర్నల్‌లో కొత్త స్టడీకి చెందిన ఈ రిపోర్టును ప్రచురించారు.
అమెరికా పరిశోధకులు చేపట్టిన కొత్త అధ్యయనంపై నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ పౌల్ స్పందించారు. ఈ స్టడీ నిర్వహణలో తీవ్రస్థాయిలో తప్పులున్నట్లు వారు పేర్కొన్నారు. మెథడాలజీ సరిగా లేదని, దాని వల్లే తప్పుడు అంచనాలు చేసినట్లు వినోద్ వెల్లడించారు. భారత్‌లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం 99 శాతం మరణాలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. 2019లో నమోదు అయిన మరణాల కన్నా.. 2020లో దాదాపు 4.74 లక్షల మరణాలు ఎక్కువగా నమోదు అయినట్లు వినోద్ పౌల్ చెప్పారు. కానీ 11.9 లక్షల మంది ఎక్కువగా మరణించి ఉంటారని ఆ అధ్యయనం చేసిన అంచనా ఆమోదయోగ్యంగా లేదని వినోద్ పౌల్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE