పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వర్మ భారీ మెజార్టీతో గెలుపొందారు. దిగ్గజనాలను మట్టికరిపించి తన సత్తా చాటారు. నియోజకవర్గంలో తన బలం ఏంటో నిరూపించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా వర్మ పిఠాపురం నుంచి టికెట్ ఆశించారు. కానీ చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటికే తన అనుచరులు వర్మ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీటు త్యాగం చేయొద్దని తేల్చి చెప్పారు.
కానీ అధిష్టానం మాటను కాదనలేక వర్మ.. పవన్ కళ్యాణ్‌కు తన సీటును త్యాగం చేశారు. అదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ ఫేజ్‌లోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ వర్మకు మాటిచ్చింది. కానీ చివరికి వర్మకు ఇచ్చిన మాటను హైకమాండ్ నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శాసనమండలిలో రెండు స్థానాలు ఖాళీ అయితే.. వాటిని టీడీపీ, జనసేన చెరొకటి పంచుకున్నాయి. అయితే టీడీపీకి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వర్మకు ఇవ్వకుండా కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యకు ఇచ్చారు. ఈక్రమంలో అటు ఎమ్మెల్యే టికెట్ దక్కక.. ఇటు ఎమ్మెల్సీ పదవి దక్కక వర్మకు దక్కిందేంటని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అటు పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన పవన్ కళ్యాణ్.. ఆ నియోజకవర్గాన్ని తన కొంచుకోటగా మల్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ భూమిని కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకుంటున్నారు. అలాగే పిఠాపురం రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పవన్ ఎఫెక్ట్ మెల్లిగా వర్మ నియోజకవర్గంలో రాజకీయ ఉణికిని కోల్పోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో వెంటనే వర్మ అలెర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగష్టు 15న అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పిఠాపురంలో డొక్కా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసే క్యాంటీన్లను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికే క్యాంటీన్ల నిర్మాణం కొనసాగుతోంది.
అయితే అంతకంటే ముందే వర్మ పిఠాపురంలో అన్నా క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇచ్చారు. వర్మాస్ కాఫ్యా ఫౌండేషన్ ద్వారా తొలి అన్నా క్యాంటీన్‌ను వర్మ ఓపెన్ చేశారు. దీనిని పూర్తిగా తన సొంత నిధులతోనే ప్రారంభించారు. అయితే మరో నెలరోజుల్లో రాష్ట్రమంతటా ప్రభుత్వం క్యాంటీన్లను ఓపెన్ చేయనుండగా.. ఈసమయంలో వర్మ పిఠాపురంలో అన్నా క్యాంటీన్‌ను స్థాపించడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌కు షాక్ ఇవ్వాలనే వర్మ ఇలా చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ