ఏపీ మాజీ సీఎం ఢిల్లీ పర్యటనతో ఏపీలో రాజకీయాలు టర్న్ తీసుకోనున్నాయా..? ఇన్నాళ్లు ఎన్డీయేకు మద్దతుగా ఉన్న జగన్ ఇప్పుడు ఇండియా కూటమి వైపు వెళ్లబోతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీలో చేసిన ధర్నా ప్రత్యర్థి పార్టీ కి ఎంత నష్టం చేకుర్చిందో తెలియదు కానీ.. ఏపీ రాజకీయాల్లో మాత్రం కొన్ని ఊహాగానాలకు తెరలేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ లతో జంతర్ మంతర్ వద్ద ధర్నా తో పాటు తమ పార్టీ నాయకులపై దాడులకు సంబంధించిన ఫోటో గ్యాలరీ ని ప్రదర్శించారు. వైసీపీ నిరసనకు జాతీయస్థాయిలో 8 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సమాజ్ వాదీ, ఐయూఎంఎల్, అన్నాడీఎంకే, శివసేన..టీఎంసీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, వీసీకే, ఆప్ పార్టీల నాయకులు జగన్ కు మద్దతు తెలిపారు. వైసీపీకి మద్దతు తెలిపిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ శివసేన నుండి ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి నదీముల్ హాక్, అన్నా డీఎంకే నుంచి తంబీ దురై వంటి కీలక నేతలు ఉన్నారు. వైసీపీ నేతలపై దాడులను తీవ్రంగా ఖండించిన నేతలు విపక్షాలపై దాడులు, అరాచకాలు సంప్రదాయం కాదని హితవు పలికారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వయంగా వచ్చి వైఎస్ జగన్ ధర్నాకు సంఘీభావం తెలపడం.. శివసేన పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ కూడా వచ్చి జగన్‌ను కలిసి ధర్నాకు మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్లబోతున్నారు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీలో టీడీపీ తో చేతులు కలిపి తనను ఓడించిన బీజేపీ కంటే.. తనకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్‌కు చేరువగా ఉండటమే సేఫ్ అనే భావనలో జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్ అన్ి ఆలోచించుకునే ఇండియా కూటమి నేతల్ని ధర్నాకు మద్దతుగా ఉండాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
2014 సంవత్సరం నుంచి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జగన్ పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ ఇకపై అలా ఉండదనే సిగ్నల్స్‌ను ఢిల్లీ ధర్నా ద్వారా రాజకీయ వర్గాల్లోకి జగన్ పంపారనేది రాజకీయ విశ్లేషకుల మాట. జాతీయ రాజకీయాల్లోని ఏదో ఒక కూటమికి ప్రత్యక్షంగా మద్దతు తెలపడం వల్లే ప్రయోజనం ఉంటుందనే క్లారిటీకి జగన్ వచ్చారని విశ్లేషణలు చేస్తున్నారు. తన నిరసనలకు నైతిక మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చిన ఇండియా కూటమి పార్టీలను కాదనుకొని.. వైసీపీని ఏమాత్రం పట్టించుకోని ఎన్డీయే కూటమి వైపు జగన్ అడుగులు వేసే అవకాశాలు లేవనేది సుస్పష్టం. వైఎస్ జగన్ ఇప్పుడు బీజేపీని కాదనుకుంటే.. ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓ వైపు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం వైసీపీ అవినీతి బయటకు తీస్తామని చెబుతోంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే పెండింగ్ కేసులపై దర్యాప్తును మళ్లీ యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో రానున్న రోజుల్లో జగన్ ప్రయాణం ఎలా సాగనుందనేది ఉత్కంఠను రేపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ