
డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. పార్టీలో ఆమెకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండటంతో పాటు.. ట్రంప్‌తో పోటీ విషయంలో కూడా దూసుకెళ్తున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా బరిలో ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి 6శాతం ఓట్ల తేడా ఉండగా.. ఇప్పుడది 1శాతానికి తగ్గిపోవడం ట్రంప్ వర్గీయులను ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. బైడెన్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వే తాజాగా విడుదలైంది.
గతంలో బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడే అభ్యర్థి ఎవరనే విషయంలో ఓ సర్వే జరగ్గా.. కేవలం 14 శాతం మందే హ్యారిస్‌కు మద్దతిచ్చారు. ప్రస్తుతం 93 శాతం మంది డెమోక్రాట్లు హ్యారిస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రిపబ్లికన్లలో అంతే శాతం మంది ట్రంప్ వెంట ఉన్నారు. తాజాగా వెలువడిన సర్వేలో అమెరికా ఓటర్లలో 48శాతం మంది ట్రంప్‌నకు మద్దతివ్వగా.. హ్యారిస్‌కు 47శాతం మంది మద్దతుగా నిలిచారు.
అంటే కేవలం 1 శాతం తేడాయే ఇప్పుడు ఇద్దరి మధ్య ఉంది. అదే బైడెన్ సమయంలో ఈ తేడా 6 శాతం ఉండేది. ముఖ్యంగా 30ఏళ్ల లోపు యువత హ్యారిస్‌కు భారీగా మద్దతిస్తున్నారు. 45 ఏళ్ల లోపు వయసు వారిలో 10శాతం మంది ఎక్కువగా ఆమెకు అండగా నిలుస్తున్నారు. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌నకు 48 శాతం, కమలా హ్యారిస్‌కు 46శాతం మద్దతు లభించింది. అదే బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బరిలో ఉన్నప్పుడు 9శాతం తేడా ఉండేది.
డెమోక్రటిక్ పార్టీ తరఫున అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ జులై 27న కమలా హ్యారిస్ సంతకం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశానని చెప్పిన ఆమె.. ప్రతి ఓటునూ సాధించడానికి కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజలంతా తన తరఫున చేసే ప్రచారంతో నవంబరు 5న జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
మరో వైపు ట్రంప్ కూడా ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరుపున కమలా పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులభమవుతుందని ఈ మధ్యే హాట్ కామెంట్స్ చేసిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే ..మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని తాజాగా ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్ష ఎన్నికల్లో కనుక ఒకవేళ కమలా హ్యారిస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విమర్శించారు. హ్యారిస్ ప్రజాదరణ కోల్పోయారని విమర్శించారు. దేశ ఉపాధ్యక్షురాలిగా హ్యారిస్ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని… ఎంతోమంది అక్రమంగా అగ్రరాజ్యమైన అమెరికాలోకి వలస వస్తున్నా కూడా ఆమె అడ్డుకోలేదని ఆరోపించారు. హ్యారిస్ ఓ విఫలమైన వైస్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY