పారిస్‌లో జరుగతున్న ఒలింపిక్స్‌లో మూడో పతకమే టార్గెట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కంచు మోత మోగించిన సింధు..పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఆగస్ట్ 1న జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో చైనా షట్లర్ హే బింగ్‌జావ్ చేతిలో 19-21, 14-21 తేడాతో ఓటమిపాలై విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
హోరాహోరీగా సాగిన ఆటలో పీవీ సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. క్రాస్ కోర్ట్ షాట్స్‌తో సింధు, స్మాష్‌లతో చైనా ప్లేయర్ సత్తా చాటింది. కాగా, అంతిమంగా తొలి గేమ్‌ను చైనా ప్లేయర్ చేజిక్కుంచుకుంది. రెండో గేమ్‌లో కూడా ప్రత్యర్థిని సింధు ప్రతిఘటించలేకపోయింది. ఆఖర్లో సింధు పుంజుకున్నా కూడా అది పాయింట్ల మధ్య ఉన్న అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
మరోవైపు తన ఓటమికి గల కారణాల గురించి పీవీ సింధు వివరించింది. అలాగే వచ్చే ఒలింపిక్స్ వరకు తాను కొనసాగుతానో లేదా అనే విషయాలు గురించి కూడా స్పందించింది. వచ్చే ఒలింపిక్స్‌కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి.. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటానని పీవీ సింధు తెలిపింది. ఆ తర్వాత ఆలోచిస్తానన్న సింధు.. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయానని ఫీలయ్యింది. ఇది చాలా బాధాకరమని.. మొత్తంగా మ్యాచ్‌లో తన తప్పులను నియంత్రించాల్సిందని చెప్పుకొచ్చింది.
తొలి రౌండ్లో ఓ దశలో 19-19తో సమానంగా ఉన్నానని, దాన్ని విజయంగా ముగించలేకపోవడం బాధగా ఉందని సింధు చెప్పింది. ప్రతి పాయింట్ కోసం పోరాడానని..అయితే సులభంగా పాయింట్లు వస్తాయని, సులభమైన పోటీ ఉంటుందని భావించలేమన్నారు. డిఫెన్సివ్ చేస్తూ అయినా తన తప్పులను నియంత్రించాల్సిందని సింధు తెలిపింది. కొన్ని స్మాష్‌లు కోర్టు బయటపడ్డాయన్న సింధు.. దాన్ని లోపలకి కొట్టి ఉంటే పాయింట్లు దక్కేవని అంది. నివారించదగిన కొన్ని తప్పులు కొనసాగాయని.. అవి ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని అన్న సింధు.. చైనా షట్లర్ బాగా ఆడిందని కితాబిచ్చారు.
పారిస్ ఒలింపిక్స్ కోసం ఎంతో కష్టపడ్డానని పీవీ సింధు చెప్పింది. ఈ ఆట కోసం మరి కొంచెం సన్నద్ధమవ్వాల్సింది కదా.. అనే ఫీలింగ్ లేదని… ఎందుకంటే తనకు సాధ్యమైనంతగా ప్రిపేర్ అయ్యానని.. ప్రతీది చేశానని తెలిపింది. ఇక మిగిలింది విధి అని భావిస్తున్నానంటూ పీవీ సింధు పేర్కొంది.