కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో దుకాణాలు, రెస్టారెంట్ల నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. షాపులు తొందరగా మూసెయ్యాలి లేకపోతే పోలీసులు ఊరుకోరు అంటూ భయపడుతూ దొంగచాటుగా దుకాణాదారులు వ్యాపారం చేసుకోవాల్సిన పని లేదు.. అమ్మో లేటయ్యింది షాపులు బంద్ చేస్తారేమో అంటూ టెన్షన్ పడాల్సిన పని కస్టమర్లకు అక్కర్లేదు. ఎంచక్కా తాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అర్థరాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్‌లోని రెస్టారెంట్లతో పాటు ఇతర సంస్థలను తెల్లవారుజామున 1 గంటల వరకు తెరిచి ఉంచుకునే వెసలుబాటును కల్పించింది. అయితే మద్యం షాపులకు మాత్రం యధావిధిగా కండీషన్ పెట్టారు. మద్యం షాపులను మినహాయించి రెస్టారెంట్లు సహా అన్ని సంస్థలను తెరిచి ఉంచడానికి అనుమతినిస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో అధికారిక ఉత్తర్వులు ఆమోదించారు.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలోని రెస్టారెంట్లు, మద్యం మినహా మిగిలిన అన్ని దుకాణాలు, షాపులు తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయడానికి అనుమతిస్తామని చెప్పారు సీఎం రేవంత్. సీఎం మాట్లాడుతూ.. నేను మద్యానికి వ్యతిరేకిని. ముందుగా చెప్పిన సమయానికి మద్యం దుకాణాలు మూత పడతాయన్నారు. అవి ఎక్కువ సేపు తెరిచి ఉంటే, విచ్చలవిడిగా తాగుతారని అందుకే మద్యం షాపులకు పర్మిషన్ ఇవ్వట్లేదన్నారు. హైదరాబాద్ వాసులపై పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ మేము కాంక్రీట్ పోలీసింగ్ చేయబోతున్నాం అని అన్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ప్రభుత్వ కృషిలో భాగంగా.. అన్ని వేళలా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం అన్ని రకాలుగా దోహదపడే అంశంగా భావిస్తున్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యే మరియు ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో నగర పరిస్థితిని వివరించారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లలో రెస్టారెంట్లు మరియు ఇతర దుకాణాలను ముందస్తుగా మరియు బలవంతంగా మూసివేయడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో కొంతమంది అధికారులు రాత్రి 11 గంటల తర్వాత వారి ఇళ్ల వెలుపల గుమిగూడిన యువకులను వెంబడించి లాఠీలతో దాడి చేసినట్లు సభలో వివరించారు. నగరం అంతటా రాత్రి 11 గంటల తర్వాత పోలీసులు ప్రజలపై దాడులు చేస్తున్నారని మరియు ఇది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.