
తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టులపై వేధింపులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి లేఖ రాశారు. జర్నలిస్టులపై నిరంతరం జరుగుతున్న ఆర్గనైజ్డ్ ఆన్‌లైన్ ట్రోలింగ్, వేదింపులు , భౌతిక బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై ఆర్గనైజ్డ్ ఆన్‌లైన్ ట్రోలింగ్ వేధింపులు , భౌతిక బెదిరింపులు పెరుగుతున్న ఉదంతాలు జరుగుతున్నాయి. ఈ దుష్ప్రవర్తన కేవలం పత్రికా స్వేచ్ఛను చిన్నబుచ్చడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే జర్నలిస్టుల రక్షణకు, భద్రతకు ముప్పును కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు అందిస్తున్న పలువురు జర్నలిస్టులపై ఆన్‌లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ ఉదాంతాలు వారిని కలవరానికి గురి చేస్తున్నాయి. పలువురు సోషల్ మీడియా వేదికగా పరుషపదజాలం, దుర్భాషాలడంతో ఆయా జర్నలిస్తుల గౌరవానికి భగం కలగడటమే కాదు వారు మనస్థాపానికి గురికాబడుతున్నారు. రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని ఆర్గనైజ్డ్ ట్రోల్ ఫారమ్స్, వార్ రూములను నిర్వహిస్తూ వారిని నిరంతరం ఆన్‌లైన్ ద్వార దుర్భాషలకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతే కాదు కొన్ని అతి తీవ్రమైన కేసులలో వారి మీద క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయబడుతుంది. ఇది స్పష్టంగా వారి గొంతులను నొక్కడం మరియు స్వేచ్ఛా భావ ప్రకటనను తగ్గించే ప్రయత్నాలు . జాగరూకులైన పౌరసమాజంతో ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారము పౌరులకు వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇది పత్రికా రంగానికి కూడ ఈ స్వేచ్ఛ వర్తిస్తుంది. గత కొంతకాలంగా భారతదేశం అంతటా మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో పత్రిక స్వేచ్ఛ తగ్గుతున్నట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛ అనేది ఎటువంటి ఆంక్షలు లేకుండా లేదా ప్రభుత్వజోక్యం లేకుండా జర్నలిస్టులు , మీడియా సంస్థలు పనిచేయడానికి అనుమతించే ప్రాథమిక సూత్రం భావ ప్రకటన, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సమాజానికి ముఖ్యమైనది.
ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ క్రింది చర్యలను లేఖలో పేర్కొన్నారు..
1. కమిటీ ఏర్పాటు చేయడం : ప్రత్యేకించి మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను దర్యాప్తు చేయడానికి మరియు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
2. నిపుణుల విశ్లేషణ : నిష్ణాతులతో విలేఖరులకు వచ్చే ట్రోలుల మూలలను కనుగొని వాటిని మూయించే ప్రయత్నం చేయాలి.
3. రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు : రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా విభాగాల కోసం నైతిక మార్గదర్శకాలను జారీ చేసి, సరైన భాషా వినియోగం మరియు నిర్మాణాత్మక రాజకీయ చర్చను ఉత్ప్రేరించడం.
4. ఐ.టి. పరిశ్రమ సహకారం : ట్రోల్స్‌ను పేర్లులేని వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఐటీ పరిశ్రమ ఉన్ననిష్ణాతుల సహాయ సహకారాలు తీసుకోవాలి.
5. సైబర్ క్రైమ్ మరియు భ్రదతా చర్యలు : జర్నలిస్టులపై దుష్ప్రచారాలు, బెదిరింపులపై ఫిర్యాదు చేసినప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు మరియు సైబర్ సెక్యూరిటీ బ్యూరో త్వరగా స్పందించాలి.
జర్నలిస్టులను రక్షించడానికి, స్వేచ్చా మరియు స్వతంత్య్రమీడియా సూత్రాలను సమర్థించడానికి తక్షణ మరియు నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము.. అని ఈ మేరకు ఎం. పద్మనాభరెడ్డి లేఖలో తెలిపారు.