కేరళలోని వయనాడ్ ఘోర విపత్తు నుంచి ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. కొండచరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోగా… వందలామంది సజీవ సమాధి అయ్యారు. అయితే వయనాడ్ విలయానికి కారణం మానవ తప్పిదమేనని మొన్నటివరకూ అనేక కథనాలు వినిపించగా..తాజాగా దానిని స్పష్టకరిస్తూ వయనాడ్ విపత్తు మానవ తప్పిదం వల్లే జరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై..రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని.. త్వరలోనే దీనిపై తుది నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు.
పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కి.మీటర్ల ప్రాంతాన్ని.. ఎన్విరాన్‌మెంటల్లీ సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించడానికి 2014 నుంచి 2024 జులై 31 వరకు 6 సార్లు ముసాయిదా నోటిఫికేషన్లు జారీ చేసిన విషయాన్ని భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో దానిపై తుది నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై ఓ వైపు చర్యలు జరుగుతున్నాయని..ఈ మధ్యలోనే కేరళ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపించారు. కేవలం ఇలాంటి మానవ తప్పిదంతోనే వయనాడ్‌లో ఇలాంటి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ కనుమలు కూడా హిమాలయాల వలే పెళుసుగా ఉండే ప్రాంతాలని మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకోవడానికి భారీ ఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని తేల్చి చెప్పారు.మరోవైపు ముందస్తు హెచ్చరికలు చేసినా కూడా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా పార్లమెంట్లో ప్రకటన చేసారు.
అమిత్ షా తర్వాత ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యాలు సంచలనంగా మారాయి. అక్రమ జనావాసాలకు స్థానిక రాజకీయవేత్తల రక్షణ ఉందని ఆరోపించారు. టూరిజం పేరుతో కనీసం సరైన జోన్లను కూడా వాళ్లు ఏర్పాటు చేయలేదని భూపేంద్ర యాదవ్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతాలలో భూకబ్జాలు జరిగాయని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతం హైలీ సెన్సిటివ్ ఏరియా అని చెబుతూ ఈ విషయాన్ని భూపేంద్ర యాదవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
కాగా నౌఫాల్ అనే ఇంటి యజమాని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఒమన్ వెళ్లగా.. మూడు నెలలు తిరగక్కుండానే ఆ కుటంబంలో ఇప్పుడు పెను విషాదం నెలకొంది. ఇలాంటి విషాదాలను ఎన్నో మోసిన ఈ ఘోర విపత్తులో మరణించినవారి సంఖ్య 402కు చేరింది. 31 గుర్తు తెలియని డెడ్ బాడీలను సోమవారం అధికారులు సామూహిక ఖననం చేశారు.