ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పలు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు మరో కీలక బాధ్యతలు అప్పగించారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో .. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలన్నారు. దీని కోసం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్లాన్ చేయాలని కోరిన సీఎం.. ఒకేసారి 5నుంచి 10లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. దీనికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలని కోరారు.
వచ్చే వందరోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను.. వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు వివరించారు. అలాగే అటవీ శాఖపై సమీక్ష సందర్భంగా..ఏపీలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున మొక్కలు నాటిన కార్యక్రమాన్ని తాము చేపట్టిన విషయాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.నెల రోజుల పాటు ఏపీవ్యాప్తంగా వనమహోత్సవం నిర్వహించాలని ఆదేశించారు.
అటవీ సంపదను పెంచి.. ఆహ్లాదకరమైన వాతావరణంలో మనమంతా వనభోజనానికి వెళ్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వనభోజనాలను ప్రోత్సహించాలని.. ప్రతి ఒక్కరూ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి రోజంతా హాయిగా ప్రకృతిలో గడిపేలా, అనుసంధానమయ్యేలా, ప్రేమించేలా చూడాలి అన్నారు. అనంతరం వ్యవసాయ రంగంపై అధికారులు.. సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అటవీ శాఖ అంటే చాలా ఇష్టమని చెప్పిన చంద్రబాబు..పవన్ నాయకత్వంలో అడవిని వృద్ధి చేయాలని కోరారు.మొత్తంగా అటవీ ప్రాంతాలకు వెలుపల ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా 50 లక్షలు చొప్పున 13.5 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుంటోంది కూటమి ప్రభుత్వం.