రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలిస్ స్టేషన్ లో దళిత మహిళను చిత్రహింసలకు( థర్డ్ డిగ్రీ) గురి చేసిన విషయం తెలిసిందే. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనను పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఘటనపై నివేదిక సమర్పించాలని ఏసీపీని సీపీ అవినాశ్ మహంతి ఆదేశించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
షాద్నగర్ ఎస్సీ కాలనీలో ఉండే నాగేందర్ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జూలై 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేందర్ ఎదురింట్లోనే భీమయ్య, సునీత (35) దంపతులు ఉంటారు. వీళ్లిద్దరు కూలి పనులు చేసుకుంటారు. ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26న వాళ్లను పీఎస్కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. 30న రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు మళ్లీ వచ్చి.. పీఎస్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ సునీత ఆరోపించారు. తన కొడుకు ముందే చచ్చేలా కొట్టారని చెప్పారు.
కాగా దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండిపడ్డారు. కన్న కొడుకు ముందే బూట్లతో తంతూ చిత్రహింసలకు గురి చేయటమంటే ఇంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం వేరే ఏముంది? అని ధ్వజమెత్తారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని, రక్షించాల్సిన పోలీసుల నుంచి ఇలా రక్షణ లేని పరిస్థితి ఏమిటి? అని వాపోయారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. విషయాన్ని మీడియా హైలైట్ చేసింది. విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు నివేదిక ఆధారంగా బాధ్యుల్ని సస్పెండ్ చేశారు.