ప్రతీ శాఖలో తమ మార్కు చూపిస్తూ ముందుకెళుతున్న కూటమి సర్కార్.. తాజాగా పంద్రాగస్ట్‌కు పంచాయతీలకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో కొన్నేళ్లుగా నిధుల కొరతతో అల్లాడుతున్న పంచాయతీలకు పవన్ కళ్యాణ్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈసారి వారికి ఇచ్చే నిధుల్ని ఏకంగా 100 శాతం పెంచుతూ డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు. దీంతో ఈసారి పంచాయతీల్లో కొత్త కళ కనిపించబోతోంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీలో గతంలో గ్రామ పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి నామమాత్రపు నిధులను మాత్రమే ఇచ్చేవారు. మైనర్ పంచాయతీల్లో కేవలం 100 రూపాయలు, మేజర్ పంచాయతీల్లో 250 రూపాయలు మాత్రమే ఇస్తుండేవారు. ఇవి ఏ మూలకు సరిపోయేవి కావన్న విమర్శలు వినిపించేవి. అయితే ఈసారి ఈ నిధులను భారీగా పెంచుతూ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈసారి స్వాతంత్ర వేడుకల నిర్వహణకు మైనర్ పంచాయతీల్లో 100 రూపాయల స్ధానంలో 10 వేలు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. అలాగే స్వాతంత్ర వేడుకల నిర్వహణకు మేజర్ పంచాయతీల్లో ఇస్తున్న రూ.250 స్ధానంలో ఏకంగా రూ.25 వేలు ఇవ్వాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో ఈసారి ప్రతీ గ్రామంలోనూ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మరోవైపు రిపబ్లిక్ డే సంబరాల నిర్వహణకు కూడా.. ఇదే విధంగా నిధులు ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం ముందుగానే ప్రకటించారు. ఈ నిధులతో స్కూల్స్‌లో క్విజ్, డిబేట్, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించాలని.. విద్యార్ధులకు క్రీడా పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇవ్వాలని పవన్ ఆదేశించారు. అంతేకాకుండా ఆగస్టు 15న స్వాతంత్ర సమరయోధులతో పాటు, రక్షణ రంగంలో పనిచేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికుల్ని కూడా పిలిపించి సత్కరించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.