ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ ఆ పిటిషన్‌ను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై స్పందన కోరుతూ ఈడీ, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్‌గీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 50 మంది నిందితుల్లో నేను ఏకైక మహిళను. ఒక తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని నాకు బెయిల్ ఇవ్వండి అని తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టును కోరారు కవిత. అయితే కోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. మహిళ అనే కారణంతో ఉపశమనం కోసం కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం..బాగా చదువుకున్న వ్యక్తి, మాజీ ఎంపీ కావడంతో బీఆర్‌ఎస్ నాయకురాలు బలహీన మహిళ కాదని, హైకోర్టు సీరియస్‌గా పట్టించుకోవద్దంటూ వ్యాఖ్యానించింది.
ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే ముందు కూడా ఈడీ, సీబీఐల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. తాజాగా ఇవాళ కవిత విషయంలోనూ ఆ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. దీన్నిబట్టి ఆగస్టు 20న కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఇక సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు కవిత యత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.