వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని జగన్ విమర్శించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుకుంటున్నారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి బాగానే చూసుకున్నాడని కూడా అనుకుంటున్నారని వివరించారు. కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు… ప్రజలకు పస్తులు తప్పడంలేదు… చంద్రబాబు చేస్తున్న మోసం ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది అని జగన్ విమర్శించారు.
రాష్ట్రంలో ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా అప్పట్లో తన ప్రభుత్వం సాకులు చూపలేదని, మాట తప్పుకుండా మేనిఫెస్టోని అమలు చేశామని జగన్ అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేశామన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే శ్రీరామ రక్ష అని నమ్మామని అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు.
ఇవాళ జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఇంటికి వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదు. మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల చుట్టూ తిరగాలి. రైతు భరోసా అందడంలేదు, స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మ ఒడి అందేదన్నారు.. విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, వాహనమిత్ర, ఫీజు రీయింబర్స్ మెంట్, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా ప్రీమియం… ఇవేవీ అందడం లేదు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయిందన్నారు. జన్మభూమి కమిటీల చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోందని విమర్శించారు.