హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాగా.. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఆయా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ రెండో వారం లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సెప్టెంబర్ రెండో వారం లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పురోగతిని సమీక్షించేందుకు ఆమె రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు. భూసేకరణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. RRR కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం న్యాయమైన పరిహారం అందేలా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలని శాంతి కుమారి అన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రీజినల్ రింగు రోడ్డుపై కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన నితిన్ గడ్కరీ.. తెలంగాణ సర్కార్ భూసేకరణ చేసి ఇచ్చిన తర్వాతే రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూ.. 17 వేల కోట్ల రూపాయలతో రింగు రోడ్డు మంజూరు చేసినట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై వేగం పెంచింది.