తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ప్రతి రోజు ఏదో ఒక విషయం పై వార్ నడుస్తోంది. నిన్న రాజీవ్ గాంధీ జయంతి వేళ ఆయన విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడే సందర్భంలో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో ఆయన బీఆర్ఎస్ నేతలను పరుష పదజాలంతో దూషించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదని వ్యాఖ్యానించారు. రాజీవ్ విగ్రహం ఎప్పుడు ముడతారో చెబితే జగ్గన్నను పంపిస్తామని హెచ్చరించారు.
వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నారన్నారు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు.. విగ్రహాన్ని పెట్టేదెప్పుడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ముందు స్థానం లేదని పేర్కొన్నారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పారు. రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారని మండిపడ్డారు. వారి బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మంగళవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా సీఎం రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటుగా స్పందించారు. ‘చీప్ మినిస్టర్ రేవంత్, నా మాటలు గుర్తుంచుకో’ అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యార్థుల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం ఆయన నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్ సచివాలయం పరిసరాల్లో నుంచి చెత్తను తొలగిస్తామని తెలిపారు. నీలాంటి ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కెటిఆర్ ఎద్దేవా చేశారు.