స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Education Department Officials, Education Minister Sabitha Indra Reddy, Mango News, Minister Sabitha Indra Reddy, Sabitha Indra Reddy, Sabitha Indra Reddy Meeting with Education Department, Telangana Education Department, Telangana Education Minister Sabitha Indra Reddy, Telangana Schools, Telangana Schools Reopening, Telangana Schools Reopening Updates

రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనలేవీ లేవని, తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు, ఆన్ లైన్ తరగతుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. పున:ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యా సంస్థలను సన్నద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా బుధవారం నాడు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జిల్లా విద్యా శాఖాధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు.

విద్యార్థులుకు థర్మల్ స్క్రీనింగ్:

లక్షలాది మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నందున కోవిడ్ మార్గదర్శకాలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేసి, పాఠశాలలకు పంపడం సురక్షితమే అన్న భావనను విద్యార్థుల తల్లిదండ్రుల్లో కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. జిల్లా స్థాయిలో విద్యా సంస్థల నిర్వహణ అంతా జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీలదేనని మంత్రి స్పష్టం చేశారు. ఈ కమిటీ ఆధ్యర్యంలో విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, ఇతర ఆహార పదార్థాలన్నింటినీ కొత్తవి మాత్రమే వినియోగించాలని, కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని మంత్రి కోరారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థులు తరగతి గదులకు హాజరవుతున్న సందర్భంగా థర్మల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. తరగతి గదులను శానిటైజ్ చేసే ప్రక్రియను నిరంతరం చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.

ఇప్పటికే ఆన్ లైన్ లో 70 శాతం సిలబస్ పూర్తయినందున, విద్యార్థుల సందేహాలతో పాటు మిగతా సిలబస్ పై దృష్టి సారించాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి కోరారు. పాఠశాలల పారిశుద్ధ్య పనులను స్థానిక సంస్థలు నిర్వహించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. రానున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల్లో మనోధైర్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్షల వివరాలు వారం రోజుల్లోగా వెల్లడి:

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇతర తరగతులతో పాటే ప్రాక్టికల్ క్లాసులను నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల సంబంధించిన వివరాలను వారం రోజుల్లోగా వెల్లడిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ కళాశాలలో విధిగా ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలు కూడా విధిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కళాశాల వారిగా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, దేవసేన, ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 7 =