బిగ్ బాస్ నుంచి నాగార్జునను తప్పించాలి: బాబు గోగినేని

Babu Gogineni Demanded That Nagarjuna Be Removed From Bigg Boss

అక్రమ కట్టడం ఆరోపణల నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొంటున్నారు. కూల్చివేతల నేపథ్యంలో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా అసలే ఎన్ కన్వేషన్ సెంటర్ కూల్చివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాగార్జున పై ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని నాగార్జున పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ పోస్టులో ఉన్న ప్రకారం.. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు బిగ్గర్ బాస్ బాబు గోగినేని అని రాశారు. అక్రమ కట్టడాన్ని కూల్చడమే కాదు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ కన్వెన్షన్ యజమానులకు శిక్ష కూడా పడాలి. ఈ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలని కూడా ఫేస్బుక్ పోస్టులో రాసుకొచ్చారు. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో ని దేశం మొత్తం చూస్తుందని..నాగ్ ఇలాంటి అక్రమ కట్టడాలతో సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదని..ఆయనకు కంటెస్టెంట్ల కు నీతులు చెప్పే అర్హత లేదని అన్నారు.

ఇప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెలుగు మీడియా సర్కిల్స్ లో జోరుగా ప్రచారంలో ఉంది. కాగా బిగ్‌బాస్ 8 షో సెప్టెంబ‌ర్ 1 నుంచి మొదలుకానుంది. దీనికి  నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించనున్నారు. ఇటీవ‌లే ఈ సీజ‌న్‌కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బాబు గోగినేని అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బిగ్‌బాస్ షోలో బాబు గోగినేని కూడా ఓ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. అయితే తాను టైటిల్ గెలుచుకో లేకపోయినా.. ఆ షో ద్వారా తన ఉనికిని మరింత పటిష్టం చేసుకోవడమే కాకుండా కమల్ హాసన్ లాంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందారు.