2024 పారిస్ ఒలింపిక్స్ ముగిసింది. కాగా పారిస్ పారాలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో అట్టహాసంగా తెరలేవనుంది. దీంతో భారతీయ క్రీడా ప్రేమికులు కూడా తమ ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పన్నెండు రోజుల పాటు సాగనున్న మెగా టోర్నీలో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో 549 పతకాల కోసం పోటీ పడుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 5 బంగారు సహా 19 పతకాలు సాధించింది. ఈసారి ఈ ఆరుగురు అథ్లెట్ల నుంచి భారత్ బంగారు పతకాన్ని ఆశిస్తోంది.
పారిస్ పారాలింపిక్స్‌లో ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో నిలవనున్నారు. అథ్లెటిక్స్ (38), బ్యాడ్మింటన్ (13), షూటింగ్ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్ (4), పారా కనోయింగ్ (3), సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, రోయింగ్ (2), తైక్వాండో, స్విమ్మింగ్ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో జీవాంజి దీప్తి (400 మీటర్ల టీ20 పరుగు, వరంగల్), కొంగనపల్లి నారాయణ (రోయింగ్, నంద్యాల), షేక్ అర్షద్ (నంద్యాల, తైక్వాండో), రొంగలి రవి (అనకాపల్లి, షాట్‌పుట్) తెలుగు రాష్ట్రాల నుంచి పారిస్‌కు వెళ్లారు.
భారత్ ఈసారి 84 మందితో 12 విభాగాల్లో పతకాల వేట కొనసాగించనుంది. టోక్యో పారాలింపిక్స్(2020)లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలని చూస్తున్నారు. కాగా నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కోల్పోగా.. పారాలింపిక్స్‌లో సుమిత్ పై భారత్ ఆశలు పెట్టుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్లు సుమిత్ అంటిల్, అవని లేఖరపై భారీ ఆశలు ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకాలతో మెరిసిన ఈ ఇద్దరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలన్న పట్టుదలతో ఉన్నారు. గతసారి సుమిత్ 68.55 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. 17 ఏండ్ల వయసులో ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయిన అంటిల్ జావెలిన్‌త్రోలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. పారిస్ పారాలింపిక్స్‌లో 75మీటర్ల మార్క్ లక్ష్యంతో అంటిల్ పోటీకి దిగుతున్నాడు.
పారాలింపిక్స్‌లో 7 స్వర్ణాలతో సహా 17 పతకాలు గెలిచిన అమెరికా స్టార్ ఒక్సానా మాస్టర్స్ (సైక్లింగ్) ఈసారి ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వాలెంటీనా పెట్రిలో (ఇటలీ, అథ్లెటిక్స్) ఈ క్రీడల్లో బరిలో దిగబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనుంది. అలాగే 50 మీటర్లు, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన 16 ఏళ్ల చెక్ అమ్మాయి డేవిడ్ క్రటోచ్‌విల్, షార్క్ దాడిలో కాలు పోగొట్టుకున్న అమెరికా తార అలీ ట్రువిట్ పై కూడా అభిమానుల దృష్టి ఉంది.