ఈ జనరేషన్ లో మొత్తం టెక్నాలజీతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారని చెప్పవచ్చు. కరోనాకు ముందుతో పోలిస్తే కరోనా అనంతరం పరిస్థితులు విపరీతంగా మారిపోయాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. కొందరు పిల్లలు ఎవరి ప్రమేయం లేకుండానే ఫోన్లను అపరేట్ చేస్తున్నారు. అందుకు కారణం వారి తల్లిదండ్రులు ఫోన్లను తరచూ వాడుతుండటమే. అందుకే సంవత్సర వయసున్న పిల్లలు కూడా ఫోన్ పట్టుకుని యూట్యూబ్ షార్ట్స్ స్వైప్ చేస్తున్నారు. అయితే అయితే తాజాగా ఓ కంపెనీ సహ వ్యవస్థాపకుడు తన రెండేళ్ల కొడుకు పేరిట లింక్డిన్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశారు. దీంతో ఇప్పుడు దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఢిల్లీకి చెందిన ఒక కాఫీ ఇండియా అనే కంపెనీ వ్యవస్థాపకుడు శివేష్ కుమార్ తన 2 ఏళ్ల కుమారుడి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను సృష్టించి ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఆ ప్రొఫైల్‌లో తన కుమారుడి పేరును టైగర్ చౌహాన్ అని పెట్టారు. దీనికి సంబంధించిన బయోలో.. నేను పిల్లాడిని. ఈ ప్రపంచంలో నా స్థానాన్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. మా నాన్న స్నేహితుడు ప్రవీణ్ కుమార్ రాజ్‌భర్ ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. ‘నెట్‌వర్క్ ఈజ్ వెల్త్’ అని అందుకే కెరీర్‌కు సాయపడే నెట్‌వర్క్ కోసం ఇక్కడకు వచ్చాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం నాకు రెండేళ్లు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఒత్తిడిని అనుభవిస్తున్నాను. నేను మంచి ప్రీ-స్కూల్‌లో చేరడానికి ఈ నెట్ వర్క్ సహాయం చేస్తుందని అనుకుంటున్నాను. అంతే కాదు నేను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను (ఇంట్లో ఎవరూ నాకు ఫోన్ ఇవ్వరు). వారానికి ఒకసారి లాగ్ ఇన్ అవ్వడం వల నా కెరీర్ కి సహాయం అవుతుందని అని పోస్ట్ చేశారు.
ఈ లింక్డిన్ ప్రొఫైల్, దానికి సంబంధించిన బయోపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ బాలుడి ఫొటో, పోస్ట్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలుడి కోసం ఇప్పుడే సోషల్ మీడియా ప్రొఫైల్ తయారు చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. బాలుడి ఫొటో, పేరు లాంటి విషయాలు ఎక్కడపడితే అక్కడ వెల్లడిస్తే.. పిల్లల సమాచార గోప్యతకు భంగం కలుగుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కాగా ఆ రెండెళ్ల బాలుడికి చాలా మంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడటం కంటే లింక్డిన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం మంచిపనేనని మరి కొందరు పేర్కొంటున్నారు.