కమర్షియల్ వంటగ్యాస్ వినియోగదారులపై పెనుభారం పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.39 మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి. పెంచిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,691.50 రూపాయలకు పెరిగింది. కోల్కత- రూ.1,802.50, ముంబై- రూ.1,644, చెన్నై- 1,855 రూపాయలు పలుకుతోంది.
వ్యాపారులతోపాటు వాణిజ్య సంస్థలకు ఉపశమనం కల్పించేందుకు జులై 1న సిలిండర్ ధర రూ.30 తగ్గించిన చమురు మార్కెటింగ్ కంపెనీలు, జున్ 1వ తేదీన రూ.69.50, మే1వ తేదీన రూ.19 తగ్గించాయి. అలా మూడు నెలలు కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించింది. కాగా నెల రోజుల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది రెండోసారి. కిందటి నెల కూడా వాటి రేట్లను పెంచాయి చమురు కంపెనీలు. ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసల మేర భారాన్ని మోపాయి. ఇప్పుడు మళ్లీ 39 రూపాయలు చొప్పున పెంచాయి. అయితే ధరల పెంపు వెనుక కారణాలను చమురు మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించలేదు.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది. ప్రస్తుతం దిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.803గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ.603కే ఇది లభిస్తుంది. ముంబయిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50; చెన్నైలో రూ.818.50; హైదరాబాద్లో రూ.855; విశాఖపట్నంలో రూ.812గా ఉంది.